Friday, 1 December 2017

నవంబర్ 2017 సైన్స్ & టెక్నాలజీ


సుఖోయ్ నుంచి బ్రహ్మోస్ పరీక్ష విజయవంతం 
వాయు సేనలో సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్‌ను ప్రవేశపెట్టేందుకు గొప్ప ముందడుగు పడింది. ఇది వరకే భూ ఉపరితలం, సముద్రం నుంచి పరీక్షించిన ఈ క్షిపణిని నవంబర్ 22న యుద్ధ విమానం సుఖోయ్-30 నుంచి తొలిసారి విజయవంతంగా ప్రయోగించారు. దీంతో బ్రహ్మోస్ త్రివిధ దళాల్లో పనిచేసేందుకు తన సమర్థతను చాటుకున్నట్లయింది.
బ్రోహ్మోస్ తరగతికి చెందిన క్షిపణిని ప్రయోగించిన తొలి వాయుసేన తమదేనని ఐఏఎఫ్ ప్రకటించింది. బ్రహ్మోస్, సుఖోయ్-30ల కాంబినేషన్ వ్యూహాత్మకంగా ప్రయోజనం చేకూర్చుతుందని పేర్కొంది. 
ఎక్కడి నుంచైనా ప్రయోగం..భూమిపై నుంచి ఆర్మీ, నీటిలో నుంచి నౌకాదళం, ఆకాశం నుంచి వాయుసేన...ఇలా త్రివిధ దళాల్లో ఎవరైనా, ఎక్కడి నుంచైనా ప్రయోగించడానికి అనువుగా ఉండే సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి.. బ్రహ్మోస్. మూడు చోట్ల నుంచి ప్రయోగానికి అనువుగా ఉండేలా హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) ఈ క్షిపణిలో మార్పులు చేసింది. రష్యాకు చెందిన పీ-700 ఒనిక్ సూపర్‌సోనిక్ క్షిపణి ఆధారంగా మన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)-రష్యా ఎన్‌పీఓఎంలు సంయుక్తంగా బ్రహ్మోస్‌ను అభివృద్ధిచేశాయి. భారత్ లోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మాస్కో నదుల పేర్లను కలిపి ఈ క్షిపణికి బ్రహ్మోస్‌గా నామకరణం చేశారు. 
బ్రహ్మోస్ ప్రత్యేకతలు.. 
  • 290 కి.మీ దూరంలో ఉన్న లక్ష్యాలను ఇది ధ్వనివేగం కంటే మూడురెట్ల అధిక వేగంతో కచ్చితంగా ఛేదించగలదు.
  • ఆర్మీ, నౌకాదళం ఉపయోగించే బ్రహ్మోస్ క్షిపణి బరువు 3 టన్నులు కాగా, వాయుసేన ప్రయోగించే క్షిపణి మాత్రం 2.5 టన్నులే ఉంటుంది. అయినా సుఖోయ్-30 యుద్ధ విమానం మోసే అత్యధిక బరువున్న క్షిపణి ఇదే.
  • సుఖోయ్ యుద్ధవిమానం ఒకసారికి ఒక క్షిపణినే తీసుకెళ్లగలదు.
  • బ్రహ్మోస్‌ను అడ్డుకునేందుకు ప్రత్యర్థి యుద్ధనౌకలు క్షిపణులను ప్రయోగించేలోగానే బ్రహ్మోస్ ఆ నౌకలను ధ్వంసం చేస్తుంది.
  • క్షిపణిని ప్రయోగించిన వెంటనే సుఖోయ్ విమానం తిరుగు ప్రయాణమవుతుంది.
  • ప్రస్తుతం ప్రపంచంలోని ఏ యుద్ధనౌకలోనూ బ్రహ్మోస్ వేగాన్ని అధిగమించగల క్షిపణులు లేవు.
  • ప్రస్తుతం 290 కిలో మీటర్లుగా ఉన్న లక్షిత దూరాన్ని 450 కిలోమీటర్లకు పెంచేందుకు బ్రహ్మోస్ క్షిపణుల రూపురేఖలు, సాంకేతికతలో మార్పులు చేసేందుకు చర్యలు మొదలుపెట్టారు.
  • క్షిపణి సాంకేతికత నియంత్రణ వ్యవస్థ (ఎంటీసీఆర్)లోకి భారత్ ప్రవేశంతో ఈ క్షిపణుల పరిధిని పెంచడం సులువు కానుంది.
  • మరో 40 సుఖోయ్-30 యుద్ధ విమానాలు బ్రహ్మోస్‌ను మోసుకెళ్లగలిగేలా వాటికి అవసరమైన మార్పులు చేయడంతోపాటు ఇంకో 272 విమానాలు సమకూర్చుకునేందుకు భారత్ సిద్ధమవుతోంది.

ఉమంగ్ యాప్‌ను ప్రారంభించిన ప్రధానిఉమంగ్ (యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్) అనే కొత్త మొబైల్ యాప్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రభుత్వ సేవలన్నింటినీ ఒకే వేదికపై పొందేందుకు వీలుగా ఈ యాప్‌ను కేంద్రం తెచ్చింది. కేంద్ర, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని సంస్థల్లో 1,200 రకాల సేవలను దీని ద్వారా పొందొచ్చని అధికారులు చెప్పారు. 
ఈ యాప్ ద్వారా అన్ని రకాల చెల్లింపులు సులభంగా చేయొచ్చు. అంతేకాకుండా ఆధార్, డిజిలాకర్, భారత్ బిల్ పేమేంట్, ఈపీఎఫ్‌వో, కొత్త పాన్‌కు దరఖాస్తు తదితర సేవలనూ పొందొచ్చు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద నిరుద్యోగులు ఉద్యోగాల కోసం దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. ఈ యాప్ తెలుగుతో పాటు 12 భారతీయ భాషల్లో ఉంది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ ద్వారా మాత్రమే పనిచేసే ఈ యాప్.. ఇంటర్నెట్ అవసరం లేని ఫీచర్‌ఫోన్‌లోనూ త్వరలో అందుబాటులోకి రానుంది.


న్యూజిలాండ్‌లో తొలి వర్చువల్ రాజకీయ నేత ప్రపంచంలోనే కృత్రిమ మేధ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్)తో పనిచేసే తొలి వర్చువల్ రాజకీయ నేత ‘శామ్’ను న్యూజిలాండ్‌కు చెందిన ఎంట్రప్రెన్యూర్ నిక్ గెర్రిట్‌సెన్(49) రూపొందించారు. ఫేస్‌బుక్ మెసెంజర్‌తో పాటు తన హోమ్‌పేజ్‌లో ఉన్న సర్వేల సాయంతో విషయాల్ని నేర్చుకునే శామ్.. ప్రపంచవ్యాప్తంగా విద్య, వలసలు, ఇళ్లు సహా పలు అంశాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తుంది. శామ్ ప్రస్తుతం నేర్చుకునే దశలోనే ఉందనీ దాని రూపకర్త నిక్ తెలిపారు. 2020లో న్యూజిలాండ్‌లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓ అభ్యర్థిగా పోటీపడేలా శామ్‌ను సిద్ధం చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో కృత్రిమ మేధ ఉన్న రోబోలు ఎన్నికల్లో పోటీచేయడంపై నిషేధం ఉంది. 


అటకామా ఎడారిలో హెచ్‌ఐవీకి మందుభూమ్మీద అత్యంత ఎత్తయిన, పొడి వాతావరణం కలిగిన అటకామా ఎడారి (చిలీ) లో ఎయిడ్‌‌స చికిత్సలో ఉపయోగపడే సూక్ష్మజీవులను కనుగొన్నట్లు బ్రిటన్‌లోని న్యూకాస్టిల్ వర్సిటీ పరిశోధకులు గుడ్‌ఫెల్లో చెప్పారు. సముద్ర మట్టానికి 3 వేల నుంచి 5 వేల మీటర్ల ఎత్తు గల ప్రాంతం నుంచి సేకరించిన మట్టిలో ఈ సూక్ష్మజీవులున్నాయని తెలిపారు. పర్యావరణ వ్యవస్థలో కీలకమైన యాక్టినోబ్యాక్టీరియా జాతి హెచ్‌ఐవీ వైరస్‌ను పునరుత్పత్తి చేసే ఎంజైమ్‌ను నిరోధించడంలో సహకరిస్తుందని వివరించారు.


రక్తకణం సైజులో రోబోల తయారీరక్తకణాల సైజులో ఉండే రోబోలను తయారుచేశామని హాంగ్‌కాంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ రోబోలు శరీరంలోని చిన్న చిన్న అవయవభాగాల్లోకి చొచ్చుకుపోయి, అక్కడ ఉన్న సమస్యను నివారించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. అత్యంత సూక్ష్మపరిమాణంలో ఉన్న శైవలాలతో రూపొందించిన ఈ రోబోల లోపలి పొరల్లో అయస్కాంతాన్ని పూతగా పూశారు. దీంతో రోబో మన శరీరంలో ఎక్కడ ఉన్నా.. చర్మంపై నుంచి స్పష్టంగా తెలుసుకోవచ్చు. వీటిని ఎలుకల్లో ప్రవేశపెట్టి పరీక్షించగా.. అవి రక్తం, జీర్ణరసాలలో అనుకున్న సమయానికే కరిగిపోయాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

మత్స్య సంపదను గుర్తించే ‘సముద్ర’ పరిశోధన కేంద్ర సముద్ర మత్స్య సంపద పరిశోధన సంస్థ (సీఎంఎఫ్‌ఆర్‌ఐ), భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)తో కలిసి సముద్ర జలాల్లో పెద్దఎత్తున చేపలు లభ్యమయ్యే ప్రాంతాలను గుర్తించే ‘సముద్ర’ ప్రాజెక్టును ప్రారంభించింది. సముద్రంలో మార్పులను విశ్లేషిస్తూ, మత్స్య సంపద లభ్యతపై అంచనాలు రూపొందించే ఉపగ్రహ ఆధారిత వ్యవస్థ అభివృద్ధికి ప్రణాళికలు రచించినట్లు సీఎంఎఫ్‌ఆర్‌ఐ డెరైక్టర్ ఎ.గోపాల కృష్ణన్ తెలిపారు.

వరద ముప్పును గుర్తించే పరికరం అభివృద్ధి భూతాపోన్నతి కారణంగా మంచు ఫలకాలు కరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఏయే నగరాలు వరదల బారిన పడతాయో తెలిపే పరికరాన్ని అభివృద్ధి చేసినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తెలిపింది. భూభ్రమణంతో పాటు గురుత్వాకర్షణ ప్రభావాల ఆధారంగా నీటి పంపిణీ ఎలా జరుగుతుందో ఈ పరికరం అంచనా వేస్తుందని వెల్లడించింది. వాయవ్య గ్రీన్‌ల్యాండ్‌లోని మంచు ఫలకాలు కరగటం వల్ల లండన్ సముద్ర మట్టం పెరుగుతుందని శాస్త్రవేత్త ఎరిక్ ఇవాన్ చెప్పారు.


మంచు పలకలతో ముంబై, మంగళూరులకు ముప్పునానాటికీ కరిగిపోతున్న మంచు పలకల వల్ల తీరప్రాంత నగరాలైన ముంబై, మంగళూరుకు పెను ముప్పు పొంచి ఉందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా హెచ్చరించింది. సముద్ర తీరాలు కుచించుకుపోవడం వల్ల భూమ్యాకర్షణ, భ్రమణ శక్తులు ప్రభావితమవుతాయని, సముద్ర మట్టాల పెరుగుదలల్లో అసాధారణ పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొంది. ఇదే ధోరణి కొనసాగితే వచ్చే 100 ఏళ్లలో మంగళూరు సముద్ర మట్టం 15.98 సెం.మీ., ముంబైలో అయితే 15.26 సెం.మీ.లు పెరుగుతుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ తీరానికి(15.16 సెం.మీ.) ఇదే తరహా ముప్పు ఉందని అంచనా వేసింది. 
గ్రేడియంట్ ఫింగర్ ప్రింట్ మ్యాపింగ్’ అనే పరికరం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా 293 తీర ప్రాంత నగరాలపై శాస్త్రవేత్తలు అధ్యయనం జరిపారు. 
 

అణు జలాంతర్గామి అరిధామన్ ప్రవేశంభారత నౌకాదళం అమ్ముల పొదిలోకి మరో శక్తిమంతమైన అస్త్రం వచ్చి చేరింది. భారత అణు జలాంతర్గాముల శ్రేణిలో తొలి న్యూక్లియర్ సబ్‌మెరైన్ ఐఎన్‌ఎస్ అరిహంత్ 2009 జూలై 26న ప్రారంభమైంది. 2016 అక్టోబర్ నుంచి ఇది నావికాదళంలో చేరి సేవలందిస్తోంది. సుమారు ఎనిమిదేళ్ల తర్వాత అదే శ్రేణిలోని రెండో అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిధామన్ నవంబర్ 19న విశాఖలోని నేవల్ డాక్ యార్డులో జలప్రవేశం చేసింది. 
ఆరో దేశం.. భారత్ ఇప్పటివరకూ ప్రపంచంలో అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, చైనాలు మాత్రమే అణు జలాంతర్గాములను కలిగి ఉన్నాయి. ఐఎన్‌ఎస్ అరిహంత్‌తో న్యూక్లియర్ సబ్‌మెరైన్లు కలిగిన ఆరో దేశంగా భారత్ చేరింది. అడ్వాన్‌‌సడ్ టెక్నాలజీ వెసల్ ప్రాజెక్టు కింద మొత్తం ఐదు అణు జలాంతర్గాములను నావికా దళం కోసం భారత్ నిర్మించతలపెట్టింది. ఇందులో మొదటిది ఐఎన్‌ఎస్ అరిహంత్, రెండోది అరిధామన్. స్వదేశీ పరిజ్ఞానంతో విశాఖ నేవల్ డాక్‌యార్డులోని షిప్ బిల్డింగ్ సెంటర్‌లో ఈ ఐదు అణు జలాంతర్గాముల నిర్మాణం జరుగుతోంది. ఐఎన్‌ఎస్ అరిహంత్‌కంటే అరిధామన్ రెట్టింపు శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటుంది. అరిధామన్ సముద్ర సన్నాహాలు, ఇతర అవసరమైన పరీక్షలు పూర్తి చేసుకుని నేవీలో చేరడానికి మరో రెండేళ్ల సమయం పడుతుందని భావిస్తున్నారు.
ఇదీ సామర్థ్యం..
బరువు :
 6,000 టన్నులు 
టెస్ట్ డెప్త్ : 400 మీటర్ల వరకు 
వేగం : గంటకు సముద్ర ఉపరితలంపై 12 - 15 నాటికల్ మైళ్లు, నీటి అడుగున 24 నాటికల్ మైళ్లు
ఆయుధాలు : 750 - 1900 కి.మీల లక్ష్యాన్ని ఛేదించే కె - 15 ఎస్‌ఎల్‌బీఎం అణు క్షిపణులు - 24. కె- 4 ఎస్‌ఎల్‌బీఎం క్షిపణులు 8 ( 3,500 కీ.మీ.ల పరిధి)
టార్పెడోలు : 21 అడుగుల పొడవుండే టార్పెడోలు - 6

2018లో చైనా అమ్ముల పొదిలోకి డాంగ్‌ఫెంగ్ -41 ప్రపంచంలోని ఏ మూలనున్న లక్ష్యాలనైనా తాకేలా.. ఒకేసారి 10 అణ్వాయుధాల్ని మోసుకుపోయే ఖండాతర క్షిపణి వచ్చే ఏడాదికల్లా చైనా అమ్ముల పొదిలోకి చేరనుంది. డాంగ్‌ఫెంగ్ -41గా పిలుస్తున్న ఈ కొత్త క్షిపణి.. మాక్ 10 కంటే వేగంతో దూసుకుపోగలదు. ప్రత్యర్థి క్షిపణి రక్షణ వ్యవస్థలోకి చొచ్చుకుపోయి తన దారికి అడ్డువచ్చే వేటినైనా తునాతునకలు చేయగల సత్తా ఈ ఖండాంతర క్షిపణి సొంతమని చైనా ప్రభుత్వ వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. 2012లో ప్రకటించిన ఈ క్షిపణిని ఇంతవరకూ ఏడు సార్లు పరీక్షించగా.. తాజాగా మరోసారి నవంబర్ మొదటి వారంలో పరీక్షించినట్లు సమాచారం. 2018 ప్రథమార్ధానికి ఈ అత్యాధునిక క్షిపణి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి అందుబాటులోకి రానుంది. 12 వేల కి.మి. దూరంలో లక్ష్యాల్ని ఛేదించే డాంగ్‌ఫెంగ్-41లో మూడంచెల ఘనరూప ఇంధన వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఇది ఒకేసారి 10 అణ్వాయుధాల్ని మోసుకుపోయి వాటిని వేర్వేరు లక్ష్యాలపై ప్రయోగించగలదని గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. 

‘స్పైక్ క్షిపణుల’ ఉపసంహరణకు భారత్ నిర్ణయం ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేయాలని భావించిన స్పైక్ యాంటి ట్యాంక్ మిస్సైళ్ల ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని భారత్ నిర్ణయించింది. ఈ తరహా క్షిపణుల్ని దేశీయ పరిజ్ఞానంతో తయారుచేసే బాధ్యతను రక్షణరంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు అప్పగించింది. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా స్పైక్ క్షిపణుల సాంకేతికతను పూర్తిస్థాయిలో భారత్‌కు బదిలీ చేసేందుకు ఇజ్రాయెల్ వైపు నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ తరహా క్షిపణుల రూపకల్పనకు డీఆర్‌డీవోకు నాలుగేళ్ల గడువు ఇచ్చినట్లు వెల్లడించాయి. 
ఇజ్రాయెల్‌కు చెందిన రాఫెల్ అడ్వాన్‌‌సడ్ డిఫెన్‌‌స సిస్టమ్స్, భారత్‌కు చెందిన కళ్యాణి గ్రూప్ స్పైక్ మిస్సైళ్లను రూపొందించడానికి హైదరాబాద్‌లో రూ.70 కోట్లతో ఉత్పత్తి కేంద్రాన్ని ఆగస్టులో ప్రారంభించాయి.
 

2036లో అపోఫిస్ భూమిని ఢీకొనే అవకాశం : నాసాఅపోఫిస్ అనే గ్రహశకలం భూమిని ఢీకొట్టడం వల్ల 2036లో భారీ విధ్వంసం జరగొచ్చని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) అంచనా వేస్తోంది. ఈ గ్రహశకలం ఢీకొట్టడం వల్ల మానవాళి అంతరించిపోయే ప్రమాదం కూడా ఉండొచ్చని హెచ్చరిస్తోంది. అపోఫిస్ అనే గ్రహశకలాన్ని 2004లో నాసా తొలిసారిగా గుర్తించింది. దీని పరిమాణం దాదాపుగా రెండున్నర ఫుట్‌బాల్ మైదానాలంత ఉంటుందని అంచనా. అప్పటి నుంచి దాని కదలికలను నిశితంగా గమనిస్తోంది. 2036లో అపోఫిస్ భూమిని ఢీకొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు నాసా వర్గాలు పేర్కొన్నాయి. కచ్చితంగా చెప్పాలంటే 2036 ఏప్రిల్ 13 మన భూగ్రహానికి చివరిరోజు కావొచ్చని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 
2029లో కూడా అపోఫిస్ గ్రహశకలం భూమికి సమీపంలో, 32 వేల కిలోమీటర్ల దూరంలోనే వెళ్లొచ్చనీ, అప్పుడు దాని మార్గంలో ఏ చిన్న తేడా వచ్చినా, భూమిపై పెను విధ్వంసం జరగొచ్చని రష్యా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.


ప్రపంచంలోనే తొలి పూర్తి స్థాయి విద్యుత్ నౌక ప్రపంచంలోనే తొలి పూర్తి స్థాయి విద్యుత్ నౌకను దక్షిణ చైనాలోని గువాంగ్‌డన్ ప్రావిన్స్‌లో నవంబర్ 13న ప్రారంభించారు. దీని బరువు 600 టన్నులు, పొడవు 70.5 మీటర్లు. 26 టన్నుల లిథియం బ్యాటరీతో నడిచే ఈ నౌకకు రెండు గంటలు చార్జింగ్ పెడితే 2 వేల టన్నుల సరకును 80 కిలోమీటర్ల దూరం మోసుకెళ్లగలదు. గంటకు గరిష్టంగా 12.8 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఈ నౌకలో శిలాజ ఇంధనాలు ఉపయోగించరు. అందువల్ల దీని నుంచి హానికర ఉద్గారాలు వెలువడవు.

మొబైల్ గేమింగ్‌లో మూడోస్థానంలో భారత్ మొబైల్ గేమ్స్ ఇన్‌స్టాలేషన్‌లో భారత్ మూడోస్థానానికి ఎగబాకింది. బ్రెజిల్, రష్యాలు భారత్‌కంటే ముందు వరుసలో నిలిచాయి. హైదరాబాద్‌కు చెందిన గేమింగ్ క్రియేటర్ యూనిటీ టెక్నాలజీస్ నవంబర్ 9న ఈ విషయాన్ని వెల్లడించింది. సరిగ్గా పదినెలల కిందటి గణాంకాల ప్రకారం గేమ్స్ ఇన్‌స్టాలేషన్‌లో భారత్ తొమ్మిదో స్థానంలో ఉంది. కేవలం 300 రోజుల వ్యవధిలోనే మూడోస్థానానికి ఎగబాకడం గమనార్హం. అయితే మొదటి రెండుస్థానాల్లో అప్పుడూ, ఇప్పుడూ బ్రెజిల్, రష్యాలే ఉన్నాయి. 


ట్వీటర్‌లో డిస్‌ప్లే నేమ్ ‘పరిమితి’ పెంపు ప్రముఖ సామాజిక మాధ్యమం ట్వీటర్ ఖాతాదారులు ఇకపై తమ డిస్‌ప్లే నేమ్‌ను 50 అక్షరాల వరకు పెట్టుకోవచ్చు. ఇప్పటివరకు ఈ పరిమితి 20 అక్షరాలే ఉండగా నవంబర్ 11 నుంచి దానిని ట్వీటర్ 50కి పెంచింది. ఏదేనీ ట్వీట్‌లో ఉండాల్సిన అక్షరాల పరిమితిని కూడా ట్వీటర్ గతవారమే 140 నుంచి 280కి రెట్టింపు చేయడం తెలిసిందే. పొడవైన పేర్లు కలిగినవారు తమ పూర్తి పేరును ఇకపై డిస్‌ప్లే నేమ్‌గా పెట్టుకునేందుకు తాజా చర్య ఉపయోగకరంగా ఉండనుంది. 


భారీ గ్రహంను గుర్తించిన బ్రిటన్ శాస్త్రవేత్తలుఒక చిన్న నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న భారీ గ్రహాన్ని బ్రిటన్‌లోని వార్విక్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుర్తించారు. గురుగ్రహం పరిమాణంలో ఉన్న ఈ గ్రహానికి ఎన్జీటీఎస్-1బీ అని నామకరణం చేశారు. నక్షత్రం, గ్రహం పరిమాణాల నిష్పత్తి, వాటి మధ్య దూరం ఆధారంగా చిన్న నక్షత్ర మండలాల చుట్టూ భారీ గ్రహాలు ఏర్పడవని చెబుతున్న అనేక సిద్ధాంతాలకు ఇది విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. భూమి, సూర్యుడి మధ్య దూరంతో పోల్చితే ఈ నక్షత్రానికి, ఎన్జీటీఎస్-1బీ మధ్య ఉన్న దూరం కేవలం మూడు శాతమే. 2.6 రోజుల్లో తన పరిభ్రమణాన్ని పూర్తి చేసే ఈ గ్రహం ఉపరితలంపై ఉష్ణోగ్రతలు కూడా చాలా అధికంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.


నిర్భయ్ పరీక్ష విజయవంతంస్వదేశంలో తయారైన అణ్వాయుధ సామర్థ్యం గల క్రూయిజ్ క్షిపణి నిర్భయ్‌ను భారత్ తొలిసారి విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చాందిపూర్ ఐటీఆర్ కేంద్రం నుంచి నవంబర్ 7న ఈ పరీక్ష నిర్వహించింది. 2013 నుంచి ఇప్పటి వరకు జరిపిన నాలుగు పరీక్షల్లో నిర్భయ్ విఫలమైంది.
భూ ఉపరితలం నుంచి ప్రయోగించే ఈ సబ్‌సోనిక్ క్షిపణి(ఎల్‌ఏసీఎం) 300 కిలోల బరువు గల అణు వార్‌హెడ్లను మోసుకెళ్లగలదు. ప్రత్యర్థుల రాడార్లు, క్షిపణి రక్షణ వ్యవస్థలను తప్పించుకుని ప్రయాణం చేసేలా డీఆర్‌డీఓ దీన్ని రూపొందించింది.


గ్లెడ్ బాంబు పరీక్ష విజయవంతం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేలికపాటి గ్లెడ్ బాంబును రక్షణ శాఖ నవంబర్ 2న విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న సమీకృత పరీక్షా కేంద్రం (ఐటీఆర్) వద్ద వాయు సేన విమానం నుంచి దీన్ని జారవిడిచింది. 70 కిలోమీటర్లకుపైగా దూరంలో ఉన్న లక్ష్యాలను ఇది అత్యంత కచ్చితత్వంతో ఛేదించిందని రక్షణ శాఖ వెల్లడించింది. ఈ బాంబును ఇమారత్ పరిశోధన కేంద్రం(ఆర్‌సీఐ), రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో), వాయు సేన సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. శత్రు వైమానిక స్థావరాలను ధ్వంసం చేయగల సామర్థ్యం దీనికి ఉంది.

No comments:

Post a Comment